React ను ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు జోడించండి

మీరు ఇప్పటికే ఉన్న మీ ప్రాజెక్ట్‌కి కొంత ఇంటరాక్టివిటీని జోడించాలనుకుంటే, దాన్ని React లో మళ్ళీ రాసే అవసరం లేదు. మీ ఉన్న స్టాక్‌లో React ను జోడించి, ఇంటరాక్టివ్ React కాంపోనెంట్లను మీరు ఎక్కడైనా రెండర్ చేయవచ్చు.

Note

మీరు React ను లోకల్ గా వాడాలి అనుకొంటే Node.js ను ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. మీరు React ను ఆన్‌లైన్‌లో ప్రయత్నించవచ్చు లేదా సాధారణ HTML పేజీతో ప్రయత్నించవచ్చు, కానీ వాస్తవానికి మీరు ప్రాజెక్ట్ డెవలప్మెంట్కు వాడాలనుకునే JavaScript టూలింగ్ కు Node.js అవసరం.

మీ ప్రస్తుత వెబ్‌సైట్ యొక్క మొత్తం సబ్‌రూట్ కోసం React ని ఉపయోగించడం

అనుకొందాం మీకు ఇప్పటికే example.com లో ఒక వెబ్ యాప్‌ ఉంది, కానీ అది మరొక సర్వర్ టెక్నాలజీతో నిర్మించబడింది (ఉదాహరణకు Rails), మరియు మీరు example.com/some-app/ లాంటి అన్ని మార్గాలను పూర్తిగా React తో అమలు చేయాలనుకుంటున్నారు.

దీన్ని సెటప్ చేయడానికి మీరు దిగువ స్టెప్స్ ను అనుసరించాలని మేము సిఫార్సు చేస్తున్నాము:

1. React ఆధారిత ఫ్రేమ్‌వర్క్‌లలో ఒకదాన్ని ఉపయోగించి మీ యాప్‌లోని React భాగాన్ని రూపొందించండి.
2. మీ ఫ్రేమ్‌వర్క్ యొక్క కాన్ఫిగరేషన్‌లో /some-app ని base path గా స్పెసిఫ్య్ చేయండి (ఉదాహరణకు: Next.js, Gatsby).
3. మీ React యాప్లోని /some-app/ కింద ఉన్న అన్ని రిక్వెస్టులను స్వీకరించడానికి మీ సర్వర్ లేదా ప్రాక్సీని కాన్ఫిగర్ చేయండి.

మీ యాప్‌లోని React భాగం ఆ ఫ్రేమ్‌వర్క్‌లలో రూపొందించిన మాడ్యూల్లను వాడుకొని ప్రయోజనం పొందగలదని ఇది నిర్ధారిస్తుంది.

చాలా వరకు React-ఆధారిత ఫ్రేమ్‌వర్క్‌లు ఫుల్-స్టాక్‌గా ఉంటాయి మరియు మీ React యాప్ ను సర్వర్ యొక్క ప్రయోజనాన్ని పొందేలా చేస్తాయి. అయినప్పటికీ, మీరు సర్వర్‌లో JavaScript ని అమలు చేయలేకపోయినా లేదా చేయకూడదనుకున్నా మీరు అదే విధానాన్ని ఉపయోగించవచ్చు. ఆ సందర్భంలో, /some-app/ వద్ద HTML/CSS/JS (Next.js కోసం next export అవుట్‌పుట్, Gatsby కోసం default) ని బదులుగా వాడండి.

మీ ప్రస్తుత పేజీలో కొంత భాగాన్ని React కోసం ఉపయోగించటం

అనుకొందాం మీకు ఇప్పటికే మరొక టెక్నాలజీతో బిల్డ్ చేయబడిన పేజ్ ఉంది (Rails వంటి సర్వర్ లేదా Backbone వంటి క్లయింట్), మరియు మీరు ఆ పేజీలో ఎక్కడైనా ఇంటరాక్టివ్ React కంపోనెంట్లను రెండర్ చేయాలనుకుంటున్నారు. React ని ఇంటిగ్రేట్ చేయడానికి ఇది ఒక సాధారణ పద్ధతి—వాస్తవానికి, చాలా సంవత్సరాలుగా Meta లో చాలా వరకు React వినియోగం ఇలాగే జరుగుతోంది!

మీరు దీన్ని రెండు స్టెప్స్ లో చేయవచ్చు:

1. JSX సింటాక్స్‌ ని ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించే JavaScript ఎన్విరాన్‌మెంట్‌ను సెటప్ చేయండి, మీ కోడ్‌ను import / export సింటాక్స్‌తో మాడ్యూల్స్‌గా విభజించండి మరియు npm ప్యాకేజీ రిజిస్ట్రీ నుండి ప్యాకేజీలను ఉపయోగించండి (ఉదాహరణకు, React).
2. మీ React కాంపోనెంట్‌లను మీరు మీ పేజీలో ఎక్కడ చూడాలనుకుంటున్నారో అక్కడ రెండర్ చేయండి.

ఖచ్చితమైన విధానం మాత్రం ఇప్పటికే ఉన్న మీ పేజీ సెటప్‌పై ఆధారపడి ఉంటుంది, కాబట్టి కొన్ని వివరాలను చూద్దాం.

స్టెప్ 1: మాడ్యులర్ JavaScript ఎన్విరాన్మెంట్ను సెటప్ చేయండి

మాడ్యులర్ JavaScript ఎన్విరాన్మెంట్ మీ React కాంపోనెంట్‌లను ఇండివిడ్యుఅల్ ఫైల్‌లలో వ్రాయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, ఇది మీ కోడ్ మొత్తాన్ని ఒకే ఫైల్‌లో రాసే విధానానికి భిన్నంగా ఉంటుంది. npm రిజిస్ట్రీలో ఇతర డెవలపర్‌లు పబ్లిష్ చేసిన అన్ని అద్భుతమైన ప్యాకేజీలను ఉపయోగించడానికి కూడా ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది—React‌ తో సహా! మీరు దీన్ని ఎలా చేస్తారు అనేది మీ ప్రస్తుత సెటప్‌పై ఆధారపడి ఉంటుంది:

మీ సెటప్ పని చేస్తుందో లేదో తెలుసుకోడానికి, ఈ కమాండ్ని మీ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో రన్ చేయండి:

Terminal
npm install react react-dom

ఆపై మీ మెయిన్ JavaScript ఫైల్ టాప్లో ఈ కోడ్ లైన్‌లను జోడించండి (ఇది index.js లేదా main.js అని ఉండొచ్చు):

import { createRoot } from 'react-dom/client';

// ఇప్పటికే ఉన్న HTML కంటెంట్‌ను క్లియర్ చేయండి
document.body.innerHTML = '

// బదులుగా మీ React కాంపోనెంట్‌ను రెండర్ చేయండి
const root = createRoot(document.getElementById('app'));
root.render(
Hello, world

ఒకవేళ మీ పేజ్ మొత్తం లోని కంటెంట్‌ “Hello, World!” తో రిప్లేస్ చేయబడినట్లయితే, ప్రతిదీ అనుకొన్నట్లే పనిచేస్తున్నట్టు! దయచేసి చదువుతూ ఉండండి.

Note

మాడ్యులర్ JavaScript ఎన్విరాన్మెంట్‌ని ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌లో మొదటిసారిగా ఇంటిగ్రేట్ చేయడం కొంచెం భయంగా అనిపించవచ్చు, కానీ అది విలువైనదే! మీరు ఎక్కడైనా చిక్కుకుపోయినట్లయితే, మా కమ్యూనిటీ రిసోర్సెస్ లేదా Vite Chat ని ఉపయోగించండి.

స్టెప్ 2: పేజీలో ఎక్కడైనా React కంపోనెంట్లను రెండర్ చేయండి

మునుపటి స్టెప్లో, మీరు ఈ కోడ్‌ని మీ ప్రధాన ఫైల్లో టాప్లో ఉంచారు:

import { createRoot } from 'react-dom/client';

// ఇప్పటికే ఉన్న HTML కంటెంట్‌ను క్లియర్ చేయండి
document.body.innerHTML = '

// బదులుగా మీ React కాంపోనెంట్‌ను రెండర్ చేయండి
const root = createRoot(document.getElementById('app'));
root.render(
Hello, world

మీరు ఇప్పటికే ఉన్న HTML కంటెంట్‌ ని క్లియర్ చేయకండి!

ఈ కోడ్‌ని తొలగించండి.

బదులుగా, మీరు మీ HTML లోని నిర్దిష్ట ప్రదేశాలలో మీ React కంపోనెంట్లను రెండర్ చేయాలనుకుంటున్నారు. మీ HTML పేజీని ఓపెన్ చేసి (లేదా దానిని జెనరేట్ చేసే సర్వర్ టెంప్లేట్లను ఓపెన్ చేసి) మరియు ఏదైనా ట్యాగ్‌కి యూనిక్ id అట్రిబ్యూట్‌ని జోడించండి, ఉదాహరణకు:

ఇది document.getElementById తో ఆ HTML ఎలిమెంట్‌ను కనుగొని, దాన్ని createRoot కి పంపుతుంది, తద్వారా మీరు లోపల మీ స్వంత React కాంపోనెంట్‌ను రెండర్ చేయవచ్చు:

import { createRoot } from 'react-dom/client';

function NavigationBar() {
// TODO: వాస్తవానికి నావిగేషన్ బార్‌ ని ఇంప్లీమెంట్ చేయాలి
return
Hello from React!

const domNode = document.getElementById('navigation');
const root = createRoot(domNode);
root.render(<NavigationBar />);

index.html నుండి అసలు HTML కంటెంట్ ఎలా భద్రపరచబడిందో గమనించండి, కానీ మీ స్వంత NavigationBar React కంపోనెంట్ ఇప్పుడు మీ HTML నుండి
లో కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న HTML పేజీలో React కంపోనెంట్లను రెండరింగ్ చేయడం గురించి మరింత తెలుసుకోవడానికి createRoot వినియోగ డాక్యుమెంటేషన్‌ను చదవండి.

మీరు ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌లో React ని స్వీకరించినప్పుడు, చిన్న ఇంటరాక్టివ్ కాంపోనెంట్‌లతో (ఉదాహరణకు బటన్లు) ప్రారంభించడం సాధారణం, ఆపై మీ పేజీ మొత్తం React తో నిర్మించబడే వరకు క్రమంగా “పైకి వెళ్తూ ఉండండి”. మీరు ఎప్పుడైనా ఆ పాయింట్కి చేరుకున్నట్లయితే, React నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి వెంటనే React ఫ్రేమ్‌వర్క్‌కి మైగ్రేట్ అవ్వమని మేము సిఫార్సు చేస్తున్నాము.

ఇప్పటికే ఉన్న నేటివ్ మొబైల్ యాప్‌లో React Native‌ ని ఉపయోగించడం

React Native ను ఇప్పటికే ఉన్న నేటివ్ యాప్‌లలో కూడా క్రమంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు. మీరు Android (Java లేదా Kotlin) లేదా iOS (Objective-C లేదా Swift) లో ఇప్పటికే నేటివ్ యాప్‌ని కలిగి ఉంటే, దానికి React Native స్క్రీన్‌ని జోడించడానికి ఈ గైడ్‌ని అనుసరించండి.